00:00
- కొత్తిమీరను మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో నారుమళ్ళ లో, వేసవిలో తప్ప దాదాపు సంవత్సరం పొడవునా కొత్తిమీరను సాగు చేయవచ్చును. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేసి, వేసవిలో కూడా కొత్తిమీరను లాభసాటిగా పండించే అవకాశం ఉంది. విత్తిన 35 నుండి 55 రోజులలో కొత్తిమీరను కోసి, మార్కెట్ చేసుకోవచ్చును.
- వేసవిలో కొత్తిమీర సాగు-యాజమాన్య పద్ధతులు:వేసవిలో పండించే ఆకుకూరలలో కొత్తిమీర మంచి లాభదాయకమైన, గిరాకీ ఉన్న పంట. అయితే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను, కాంతిని కొత్తిమీర తట్టుకొనలేదు. పైగా అధిక నేల ఉష్ణోగ్రతలే మొలకశాతాన్ని తగ్గించి, మొక్క ఎదుగుదలను నిరోధిస్తాయి. ఈ అవరోధాలను అధిగమించినప్పుడే వేసవిలో కొత్తిమీర సాగు లాభదాయకంగా ఉంటుంది.
- వేసవిలో కొత్తిమీరకు నీడ ఎంతో అవసరము. చెట్లనీడలో లేదా తాటాకు పందిరి క్రింద లేదా షేడ్ నెట్ల క్రింద సాగు చేయటం ద్వారా అధిక ఉష్ణోగ్రత, అధిక కాంతి వంటి ఇబ్బందులను అధికగమించవచ్చును. అఅయితే ఈ మూడింటిలో, షేడ్ నెట్ల క్రింద సాగులో దిగుబడులు అధికంగా ఉంటాయి.
- విత్తన మోతాదు:వేసవిలో మొలక శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనం అధిక మోతాదులో వాడవలసిన అవసరం ఉంటుంది. విత్తనం అధిక మోతాదులో వాడినప్పుడు మొక్కలు ఎ క్కువగా ఉండి ముందుగా ఎదిగిన మొక్కలను తొలిసారి కోతలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక సెంటు మడికి 250 గ్రా. ల విత్తనం అవసరం ఉంటుంది. ఎకరాకు 25 కిలోల విత్తనం అవసరము.
- విత్తనశుద్ధి:అధిక సాంద్రతలో విత్తనం వేయడం జరుగుతుంది. కాబట్టి కొత్తిమీరను మాగుడు తెగులు ఆశించి పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించకుండా విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక కిలో విత్తనాన్ని 1 గ్రా. కార్బండిజమ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్లో విత్తే రెండు మూడు రోజుల ముందు శుద్ధి చేసుకోవాలి.
- జీవ నియంత్రకాలయిన సూడోమోనాస్ లేదా ట్రైకోడెర్మాలతో కూడా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. ఈ జీవ నియంత్రకాలంతో విత్తనశుద్ధి చేయకపోతే మళ్ళ తయారీ సమయంలోకాని లేదా విత్తుకొన్న తరువాత కాని ఎకరాకు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి లేదా సూడోమోనాస్ లను బాగా చివికిన పశువుల ఎరువు లేదా వాన సాముల ఎరువుతో కలిపి పైపాటుగా మళ్ళపై చల్లుకోవాలి.
- విత్తే విధానం:వేసవిలో అధిక దిగుబడి పొందాలంటే, కొత్తిమీరను ఎత్తయిన మళ్ళలో (3 అడుగుల వెడల్పు, 6 అంగుళాల ఎత్తు, తగినంత పొడవు) విత్తుకోవాలి. వేసవిలో విత్తేప్పుడు, విత్తనాన్ని ఒక సెంటీమీటరు లోతు లో పడేటట్లు సూచించిన మోతాదులో విత్తుకోవాలి. బద్ద చేసిన విత్తనాన్ని తయారయిన మళ్ళపై వరుసలలో కాని లేదా చల్లుకొనే పద్ధతిలో కాని విత్తుకోవాలి.
- బాగా చివికిన పశువుల ఎరువుల లేదా వానపాముల ఎరువును 8 భాగాలు మెత్తని మట్టితో కలిపి విత్తిన మళ్ళపై సెంటీమీటు మందంలో విత్తనం పూడేటట్లు చల్లాలి. తరువాత మళ్ళణు వారం రోజులపాటు లేదా విత్తనం మొలక ప్రారంభమయ్యే వరకు వరిగడ్డితో కప్పాలి.
- ఎరువుల యాజమాన్యము:ఎకరాకు 10 టన్నుల చొప్పున పశువుల ఎరువుతోపాటు రసాయనిక ఎరువులను ఆఖరిసారి మళ్ళను దంతి తో తిరుగద్రోలేటప్పుడు వేసుకోవాలి. ఇందుకు సెంటు మడికి 350 గ్రా. ల యూరియా, 1 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 150 గ్రా.ల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి.
- పశువుల ఎరువుతో పాటు అందుబాటులో ఉన్నట్లయితే వానపాముల ఎరువును వాడుకోవచ్చును. విత్తిన ఇరవై రోజులకు జిబ్బరెల్లిక్ ఆమ్లము పిచికారీ చేసినట్లయితే మొక్క ఎదుగుదల బాగుంటుంది.
- నీటి యాజమన్యము:వేసవి సాగులో, నీటి యాజమాన్యము మొక్కల ఎదుగుదల మరియు దిగుబడిని నిర్ధేశిస్తుంది. వేసవి గాలుల వలన, ఎత్తయిన మళ్ల మీద సాగుచేయడం వలన అవసరాన్ని బట్టి రోజుకు రెండు లేదా ఎక్కువ సార్లు తడపవలసి వస్తుంది. వీలైనంతవరకు మళ్ళను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తడపాలి. అవసరానికి మించి తడిపినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. పందిరి క్రింద సాగుచేసినప్పుడు పందిరి తడపడం వలన మంచి ఫలితం ఉంటుంది.
- మాగుడు తెగులు:అధిక మోతాదులో విత్తినపుడు మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంటను మాగుడు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. ఈ తెగులు ఆశించకుండా విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. మొక్కలు మొలిచిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ తెగులు ఆశించినప్పుడు, కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రా. ల చొప్పున కలిపి భూమి తడిసేటట్లు పిచికారీ చేయాలి.
- ఆకుమచ్చ (అల్టర్నేరియా ఆకు ఎండు):ఈ తెగులు ఆశించినప్పుడు, మొదట క్రింద ఆకులపై కాలినట్లు మచ్చలు ఏర్పడతాయి. పై ఆకులకు వ్యాప్తి చెంది, ఆకులన్నీ మాడినట్లు కనబడతాయి. దీని నివారణకు 1 గ్రా. కార్బండిజమ్ మరియు 2.5 గ్రా. మాంకోజెబ్ మందులను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
- కోత మరియు మార్కెటింగ్:కొత్తిమీర 45 నుండి 55 రోజులలో కొతకు వస్తుంది. అయితే ముందుగా ఎదిగిన మొక్కలను 30 నుండి 35 రోజులలో తొలికోత తీసుకోవచ్చు. వేసవిలో కొత్తిమీరకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది. గిరాకీని దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయ పద్ధతిలో సాగు చేసినట్లయితే రైతులు మంచి ఆదాయాన్ని పొంద వచ్చును.